వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్

  • ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్‌ చేసిన సర్కారు... మండిపడ్డ జగన్
  • ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపణ
  • హామీలు నెరవేర్చలేక భయంతోనే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు అంటూ ఆగ్రహం
  • అశోక్ బాబు విషయంలో ఓ నీతి, ఇతరులకు మరో నీతా అని ప్రశ్న
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీసు నుంచి తొలగించడంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగినందుకే ప్రభుత్వం కక్ష సాధించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్ వంటివి అమలు చేయాలని కోరడమే వెంకట్రామిరెడ్డి చేసిన నేరమా అని జగన్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రశ్నించే గొంతుకలను 'రెడ్ బుక్' రాజ్యాంగంతో అణిచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో సీఎం స్థాయిలో అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఓ సీఐ బాధపడితే, ఆయన్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

గతంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని జగన్ నిలదీశారు. తమ వారికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారిని రోడ్డున పడేశారని, సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచి వారి మరణాలకు కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తోంది కాబట్టే, ప్రశ్నించే వారికి భయపడుతోందని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Jagan
Venkataramireddy
Dismiss
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News